ఉమ్మడి ప్రకాశం, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ నియోజకవర్గంలో ఆమంచి సోదరులకు గట్టి పట్టు ఉంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా అధిష్టానం నియమించింది. దీంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారాయి. కృష్ణమోహన్ సోదరుడు స్వాములు(Amanchi Swamulu) జనసేనలో చేరునున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ వార్తలకు బలం చేకూర్చేలా స్వాములు పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. జనసేన పార్టీకి తన సేవలు అందిస్తానని పవన్(Pawan Kalyan)కు తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ నెలాఖరులోపు స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జనసైనికులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో స్వాములు(Amanchi Swamulu) ఫోటో వేశారు. దీంతో పార్టీలో ఆయన చేరడం ఖాయమైనట్లు భావిస్తున్నారు.