Ambati Rambabu fires on TDP and Janasena: జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటం గ్రామంలో ఏదో జరిగిపోతుందంటూ, రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా జరుగనుందంటూ ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయంటూ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆక్రమణల తొలగింపు అనేది చిన్న విషయం అని, దానిపై టీడీపీ, జనసేన పార్టీలు చవకబారు రాజకీయం చేశాయని ధ్వజమెత్తారు. ఇప్పటం గ్రామంలో హైకోర్టు ఏం చెప్పిందో ఇప్పటికైనా నేతలు తెలుసుకోవాలని మంత్రి హితువు పలికారు. ప్రభుత్వం ఎక్కడా దౌర్జన్యంగా వెళ్లలేదనీ.. న్యాయంగానే వెళ్లిందని న్యాయస్థానం స్పష్టం చేసిందని వివరించారు.
కోర్టును తప్పుదోవ పట్టించిన 14 మందికి రూ. లక్ష జరిమానా విధించిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. కోర్టును మభ్యపెట్టి స్టే తెచ్చుకున్నట్లు తేలిపోయిందన్నారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్నే కూల్చివేయాలంటూ నానా హంగామా చేశారంటూ మండిపడ్డారు. కోర్టులను మోసం చేసేందుకు కూడా వెనుకాడలేదని దుయ్యబట్టారు. చిట్‌ఫండ్ కంపెనీలపై రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయనీ.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు. రామోజీ సంస్థలన్నీ చట్ట వ్యతిరేకంగా నిర్మితమయ్యాయనీ.. ఒక్కొక్కటిగా తేటతెల్లమవుతున్నాయని ఆరోపించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతోందనీ.. త్వరలోనే అన్నీ నిగ్గు తేల్చుతామని మంత్రి అంబటి (Ambati Rambabu) అన్నారు.