ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులు(Summer Holidays) ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. దాదాపు 50రోజుల పాటు పాఠశాలలు మూతపడనున్నాయి. జూన్ 12 తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 23 నాటికి పరీక్షలన్ని పూర్తి చేయాలని ఆదేశించింది. గతేడాది మే 1న పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కాగా ఈసారి ఎండల తీవ్రతతో పాటు ఎన్నికల దృష్ట్యా వారం రోజుల ముందుగా సెలవులు ప్రకటించారు.
Summer Holidays | మరోవైపు విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. కాగా ప్రస్తుతం మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు నిర్వహిస్తున్నారు.