ఏపీలో రాష్ట్రంలో సీబీఎస్ఈ(CBSE) గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలుండగా.. వాటిని పీరియాడిక్, టర్మ్ పరీక్షలుగా మార్చింది. పీరియాడిక్ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ) -2 ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్నారు. పీడబ్ల్యూటీలు మొత్తం నాలుగు ఉంటాయి. టర్మ్ పరీక్షలు రెండు ఉంటాయి. టర్మ్-1 నవంబరులో, టర్మ్-2 పరీక్షలను మార్చిలో నిర్వహించనున్నారు.
టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాత, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలుంటాయి. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత, 10 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలుంటాయి. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పదో తరగతిలో అయిదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. మొదటి భాషగా ఇంగ్లీష్, రెండో భాషగా తెలుగు ఉంటుంది. మూడో భాష హిందీ ఉండదు. ఆరో సబ్జెక్టుగా స్కిల్ సబ్జెక్టును అమలు చేయనుండగా 50 మార్కులకు థియరీ, 50 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.
సీబీఎస్ఈ(CBSE) గ్రేడ్లు ఇలా..
91-100 మార్కులు – గ్రేడ్ A1
81-90 మార్కులు – గ్రేడ్ A2
71-80 మార్కులు – గ్రేడ్ B1
61-70 మార్కులు – గ్రేడ్ B2
51-60 మార్కులు – గ్రేడ్ C1
41-50 మార్కులు – గ్రేడ్ C2
33-40 మార్కులు – గ్రేడ్ D