ఏపీ మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడదల రజినీకి(Vidadala Rajini) హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల ఆమెతో పాటు జాషువా అనే ఐపీఎస్ ఆఫీసర్ పైన ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విడదల రజిని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) గురువారం వాయిదా వేసింది. ఆమె బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది కానీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కి సూచించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 2కి వాయిదా వేసింది.
కాగా, ఈ వారం ప్రారంభంలో విడదల రజిని(Vidadala Rajini), సస్పెండ్ చేయబడిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరో ఇద్దరిపై ACB కేసు నమోదు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి, ఆయన నుండి రూ. 2.2 కోట్లు డబ్బు వసూలు చేసినట్లు వీరంతా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని పేర్కొంటూ, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో వ్యవహరిస్తోందని రజిని ఆరోపించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీని విడిచిపెట్టిన టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు వ్యక్తిగత కక్ష్యతో తనపై తప్పుడు కేసును సృష్టించారని ఆమె ఆరోపించారు.