ఏపీ ప్రభుత్వం ఆశలపై హైకోర్టు(AP High Court) నీళ్లు చలింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్‌కు తరలించే యత్నాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఆ ధర్మాసనం తీర్పు వచ్చేంతవరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. ఇటు ప్రభుత్వ వాదనలు, అటు పిటిషనర్ల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలించాలని భావించిన ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది.
కాగా విశాఖ(Vizag)లో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలు ఉండేలా హై లెవెల్ కమిటీ గుర్తించింది. అలాగే రుషికొండ(Rushikonda)పై నిర్మించిన భవనంలో సీఎం జగన్(CM Jagan) ఉండాలని భావించారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టు(AP High Court)ను ఆశ్రయించారు.