Attack on TDP senior leader At Tuni in kakinada distirct: కాకినాడ జిల్లా తునిలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకుడు, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు పోల్నాటి శేషగిరిరావుపై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. తునిలో ఆయన నివాసం ఉంటున్న ఇంటికి భవానీ దీక్షాధారుడి వేషధారణలో దుండగుడు వచ్చాడు. మెుదట డబ్బులివ్వగా.. బియ్యం కావాలని కోరటంతో.. శేషగిరి రావు బియ్యం తీసుకువచ్చి.. పంచెలో పోస్తుండగా.. ఒక్కసారిగా దుండగుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి తెగబడ్డాడు. చెయ్యి అడ్డుపెట్టి, దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన శేషగిరిరావు ప్రతిఘటిస్తూ, కిందపడిపోయాడు. దీంతో దుండగుడు మరొకసారి ఆయనపై దాడి (Attack) చేశాడు. శేషగిరిరావు గట్టిగట్టిగా కేకలు వేయటంతో.. నిందితుడు కత్తిని అక్కడే వదిలేసి.. బయటకు పరుగు తీశాడు. తీవ్ర గాయాలైనప్పటికీ శేషగిరిరి రావు, దుండగుడు వెంట కొద్ది దూరం పరిగెత్తారు. అయితే కొంత దూరంలో నిందితుడు తీసుకువచ్చిన బండిపై, పరారయ్యాడు.
చేతి కండరం వేలాడుతూ, తలకు తీవ్ర గాయమై రక్తమోడుతున్న శేషగిరిరావును కుటుంబీకులు హుటాహుటిన తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. దాడి విషయం తెలుసుకున్న, టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, వరపుల రాజా తదితరులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు.
ఈ హత్యాయత్నం వెనుక మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి దాడిశెట్టి రాజా, వ్యక్తులపై దాడి సంస్కృతి టీడీపీ నేతలదేనని కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడుది దాడి స్వభావం అని ఆరోపణలు గుప్పించారు.