విజయవాడ(Vijayawada)లోని విద్యాధరపురం మినీ స్టేడియంలో శుక్రవారం సీఎం కార్యక్రమం ఉంది. ఈ సభకు డ్వాక్రా మహిళల్ని తీసుకువెళ్ళడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మీరు రాకపోతే మా ఉద్యోగాలు పోతాయి అంటూ ఓ అధికారి పంపిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నిర్వహించనున్న వైఎస్ఆర్ వాహనమిత్ర నిధుల విడుదల సభ కోసం డ్వాక్రా మహిళలను తీసుకొచ్చే బాధ్యతను ఉన్నతాధికారులు ఆయా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్ పర్సన్(RP) లపై పెట్టారు. దీంతో.. తన గ్రూపు సభ్యులందరూ తప్పనిసరిగా ముఖ్య మంత్రి సభకు రావాల్సిందేనంటూ.. ఓ రిసోర్స్ పర్సన్ పెట్టిన వాయిస్ మెసేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘అందరికీ శుభోదయం.
గ్రూపు సభ్యులందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నాను. ఇంకెవరైనా తెలియని వారు ఉంటే వాళ్ళ కోసం ఈ వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. విద్యాధరపురంలోని స్టేడియంలో ముఖ్య మంత్రి కార్యక్రమం ఉంది. శుక్రవారం ఉదయం 8.30 గంటల లోపు గ్రూపు సభ్యులందరూ మా ఇంటికి రావాలి. అక్కడి నుంచి ఆటోల్లో మిమ్మల్ని సభ జరిగే దగ్గరికి తీసుకెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. మాకు ఒక్కొక్కరికీ 150 మందిని తీసుకురావాలని ఆదేశించారు. ఒకవేళ తీసుకువెళ్లకపోతే.. మరుసటి రోజు ఉద్యోగానికి రావాల్సిన పనిలేదని చెప్పారు. దీనినిబట్టి పైనుంచి మాపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోండి. మీరు మా సమస్యను అర్థం చేసుకుని, శుక్రవారం ఉదయం మా ఇంటి వద్దకి రావాలి. నేను నిన్నటి నుంచి అందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నాను. ఏమీ అనుకోవద్దు.. అర్థం చేసుకోండి. రాలేకపోయామంటూ ఫోన్లు చేసి కారణాలు చెప్పొద్దని ముందే చెబుతున్నాను. కచ్చితంగా రావాల్సిందే.’ అని తన పరిధిలోని డ్వాక్రా గ్రూపుల సభ్యులకు విజయవాడ(Vijayawada)కు చెందిన ఓ రిసోర్స్ పర్సన్ వాయిస్ మెసేజ్ పెట్టడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ముఖ్యమంత్రి జగన్(YS Jagan) సభలకు డ్వాక్రా గ్రూపులను బలవంతంగా తరలించడంపై మహిళల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. రాజధానిలో సెంటు పట్టాల పంపిణీ కార్యక్రమం సహా ఎక్కడ సభలు జరిగినా డ్వాక్రా గ్రూపుల నిర్వహణను చూసే ‘ఆర్పీలు, ఇతర సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, జనాన్ని తరలిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సభలకు వచ్చేందుకు డ్వాక్రా మహిళలు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో.. వారిపై ఒత్తిడి తెచ్చి మరీ తీసుకెళ్తున్నారు. తాజాగా శుక్రవారం విజయవాడ విద్యాధరపురంలోని స్టేడియంలో వైఎస్ఆర్ వాహన మిత్ర అయిదో విడత పథకం నిధుల విడుదల కార్యక్రమం జరగబోతోంది. ఈ సభకు డ్వాక్రా గ్రూపు మహిళలను పెద్దసంఖ్యలో తీసుకురావాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ బాధ్యతను ఆర్పీలపై పెట్టడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అలోవెరా ని ఇలా కూడా ఉపయోగించవచ్చు అని తెలుసా?
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat