వైసీపీకి తాజాగా రాజీనామా చేసిన ముగ్గురు కీలక నేతలు ఈరోజు డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీని ఎప్పుడు ఎవరు వీడతారో అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర అసంతృప్తితో ఒంగోలు నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి(Balineni).. వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను(Samineni Udayabhanu), కిలారి రోశయ్య(Kilari Rosaiah) కూడా వైసీపీకి టాటా చెప్పారు. వీరు ముగ్గురూ కూడా ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పుకున్నారు. వారిని పవన్ కల్యాణ్.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం శ్రమించాలని చెప్పారు.
అయితే వైసీపీకి రాజీనామా చేసే సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో త్యాగాలు చేసేవారికి, కష్టపడి పనిచేసేవారికి ఎటువంటి మంచి జరగదని, కనీస గుర్తింపు కూడా లభించదని అన్నారు. ఈవీఎంల అంశంపై కూడా తాను పోరాడుతుంటే పార్టీ నుంచి రవ్వంత మద్దతు కూడా లభించలేదని, తన సొంత ఖర్చుతో ఈవీఎం రీవెరిఫికేషన్‌ను అప్లై చేస్తే తమకు పట్టదన్నట్లు వైసీపీ, పార్టీ పెద్దలు వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో ఉన్న సమయంలో తాను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా బాలినేని.. వైసీపీలో ఉంచేలా కన్విన్స్ చేయడానికి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని కూడా మంతనాలు జరిపారు. కానీ అవి విఫలమయ్యాయి.