సామాన్య భక్తులకే తన తొలి ప్రాధాన్యత అని.. వీఐపీలకు ఊడిగం చెయ్యనని టీటీడీ నూతన చైర్మన్(TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్‌లో టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ బోర్డు చైర్మన్‌గా రెండోసారి అవకాశం వచ్చిందన్నారు. గరుడాళ్వార్ సన్నిధిలో భూమన చేత టీటీడీ ఛైర్మన్‌గా ఈవో ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వేదపండితులు ఆశ్వీరాదం నడుమ స్వామివారిని దర్శించుకున్నారు.
సామాన్య భక్తులకే తన తొలి ప్రాధాన్యత అని.. వీఐపీలకు ఊడిగం చెయ్యనని ఆయన స్పష్టంచేశారు. సీఎం జగన్ ఆశీస్సులతో రెండవ సారి స్వామి వారికి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. ఈ సందర్బంగా వీఐపీ భక్తులకు ఆయన కీలక విజ్ఞప్తి చేశారు. సంపద, అధికారం ఉందని స్వామివారి వద్ద అధిక సమయం గడిపినంత మాత్రాన భగవంతుడు అనుగ్రహించరన్నారు. వ్యయప్రయాసాలకు ఓర్చి గంటల తరబడి క్యూలైనులలో వేచి ఉండి దర్శించుకునే సామాన్య భక్తులపైనే శ్రీవారి ఆశీస్సులు ఉంటాయని వ్యాఖ్యానించారు. భగవంతుడి ముందు ఎవరు ముఖ్యులు కాదని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాలు పాలకమండలి సభ్యుడిగా ఉన్నా కూడా నాలుగు సార్లు వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్లలేదని వెల్లడించారు.
స్వామివారికి తాను సేవకుడినే తప్ప.. అధికారం చెల్లాయించే చైర్మన్‌ని కాదన్నారు. ఎంతో మంది చైర్మన్ రేసులో ఉండగా.. స్వామి వారి అనుగ్రహంతో సామాన్యుడైన తనకు చైర్మన్(TTD Chairman) పదవి లభించిందని హర్షం వ్యక్తం చేశారు. తనపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు సామాన్య భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా సులభతరంగా దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. గతంలో చైర్మన్‌గా ఉన్నప్పుడు దళిత గోవిందం, పున్నమి గరుడ సేవ, ఎస్వీబీసీ, కళ్యాణమస్తు, భక్తులందరికీ అన్నప్రసాద వితరణ లాంటి ఎన్నో సంస్కరణలను గతంలో తెచ్చానని గుర్తుచేశారు. టీటీడీ ఉద్యోగులకు త్వరలోనే ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు రోజా, అంబటి రాంబాబు, విప్ చెవిరెడ్డి హాజరయ్యారు.
చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముందు గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో కుటుంబసమేతంగా భూమన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలిపిరి వద్ద గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు భూమనకు ఘనస్వాగతం పలికారు.