వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యలు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ధ్వజమెత్తారు. దోచుకో, దాచుకో, పారిపో అనే మూడు విధానాలు తప్ప.. మూడు రాజధానులపై ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందా అని ప్రశ్నించారు. వికేంద్రీకరణకు అసలైన అర్థం చెప్పి, దాన్ని ఆచరణలో చూపిన ఘనత చంద్రబాబుదేనిని కితాబునిచ్చారు. అసలు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రులకు అర్థమే తెలియదని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన 12 వేల కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయో తెలియదని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రాజధానినే నిర్మించలేని అసమర్థడు, మూడు రాజధానులు కడతాడా అని నిలదీశారు. అమరావతికి, ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేకనే మంత్రులు విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులు సహా విశాఖను దోచుకోవటం కోసమేనా రాజధాని పేరిట సీఎం జగన్ చేసిన అభివృద్ధి వికేంద్రీకరణ అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను అవహేళన చేయకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని మంత్రులు మాట్లాడాలని బొండా ఉమా హెచ్చరించారు.
రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లారు: బొండా ఉమా
-