విశాఖ మేయర్(Vizag Mayor) పీఠం ఎవరికి దక్కనుంది అనే అంశం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. కుర్చీ మనదే అని కూటమి ధీమాగా ఉంటే.. మేయర్ చైర్ తమకే దక్కేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తమ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్రలో పట్టున్న బొత్స సత్యనారాయణను అధిష్టానం రంగంలోకి దింపింది. వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఆదేశాల మేరకు రీజనల్ కో ఆర్డినేటర్ కన్నబాబుతో కలిసి వైసీపీ కార్పొరేటర్లతో బొత్స సత్యన్నారాయణ(Botsa Satyanarayana) సమావేశమయ్యారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి దిశా నిర్దేశం చేశారు.
మరోవైపు కూటమి కూడా విశాఖ మేయర్(Vizag Mayor) పీఠం తమదే అని ఫిక్స్ అయిపోయింది. వైసీపీ(YCP) నుంచి భారీగా కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అవడంతో గ్రేటర్ లో కూటమి బలం పెరిగింది. వైసీపీ పాలకవర్గం మైనారిటీలో పడింది. ఇప్పటికే విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరిందర్ ప్రసాద్ కి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. ఈ అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయం వరిస్తుందని ధీమాగా ఉంది. ప్రస్తుతం కూటమికి 70 మంది కార్పొరేటర్లు 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యాబలం ఉండటంతో గెలుపు లాంఛనం అని భావిస్తోంది.
అయితే వైసీపీ నుంచి మరో నలుగురు కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్తే గాని అవిశ్వాస తీర్మానం నెగ్గడం సాధ్యం అవుతుంది. దీంతో ప్రస్తుతం తమ పార్టీకి చెందిన 34 మంది కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నంలో వైసీపీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా బొత్స సత్యనారాయణను రంగంలోకి దించి, సభ్యులను మోటివేట్ చేస్తోంది. అవసరమైతే క్యాంపుకి తరలించాలని డిసైడ్ అయింది. అలా చేస్తే దాదాపు 20 రోజుల పాటు వీరిని క్యాంపులో ఉంచాల్సి ఉంటుంది. దీనికోసం బొత్స సత్యనారాయణ కార్పొరేటర్లను సన్నద్ధం చేసినట్లు తెలుస్తోంది.