తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నారంటూ టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి(Btech Ravi) సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే తన గన్‌మన్లను తొలగించారని ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే జగన్(Jagan)దే బాధ్యత అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Bhumireddy Rajagopal Reddy)కి కూడా తొలుత ప్రభుత్వం గన్‌మెన్లు కేటాయించలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా.. గన్‌మెన్లు కేటాయించాలని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే తాను కూడా గన్‌మెన్లపై కోర్టుకు వెళ్తానని ఆయన ప్రకటించారు. అయితే బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవికాలం ముగియడంతో ఆయన గన్‌మెన్లను తొలగించినట్లుగా తెలుస్తోంది.
కాగా ఇటీవల బీటెక్ రవిని పోలీసులు రాత్రి పూట అరెస్టు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. మప్టీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకుని రెండు గంటలు ఎక్కడెక్కడో తిప్పడం సంచలనం రేపింది. మొదట వల్లూరు పీఎస్‌కు తరలించిన పోలీసులు.. అనంతరం అక్కడ్నుంచి నేరుగా కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే తనను చంపేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించినప్పుడు పోలీసులతో బీటెక్ రవి(Btech Ravi) దురుసుగా ప్రవర్తించారని కేసు పెట్టారు. ఈ కేసు పెట్టి పది నెలలు అయిన తర్వాత అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ(TDP) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.