సైకో జగన్‌ను అధికారం నుంచి దించడానికే మూడు పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. అగ్నికి ఆయువు తోడయినట్లు టీడీపీకి పవన్(Pawan Kalyan) తోడయ్యారని.. తనకు అనుభవం ఉంటే పవన్‌కు పవర్ ఉందని పేర్కొన్నారు. తణుకులో జరిగిన రోడ్ షోలో పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సైకిల్ స్పీడ్‌కు తిరుగులేదు.. గ్లాసు జోరుకు ఎదురులేదన్నారు. జగన్ కబంధ హస్తాల నుంచి ఏపీని కాపాడుకోవాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశామని.. అమరావతిని నిర్మించి అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని భావించామని.. కానీ జగన్ వచ్చి మొత్తం నాశనం చేశారని మండిపడ్డారు. అభివృద్ధి కావాలా? విధ్వంసం కావాలా? సంక్షేమం కావాలా? అని ప్రశ్నించారు. వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని వెల్లడించారు. వాలంటీర్లు అధైర్య పడొద్దని.. తాము అధికారంలోకి రాగానే రూ.10వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే వైసీసీ నేతల ప్రచారానికి దూరంగా ఉండాలని చెప్పుకొచ్చారు.
ఇక పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రైతులను ఏడిపించిన జగన్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే సీట్ల విషయంలో కొంత తగ్గానని.. చంద్రబాబు(Chandrababu) లాంటి అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరం అన్నారు. ధాన్యం తడిచిపోయాయి ఆదుకోవాలని రైతులు కోరితే మంత్రి కారుమూరి చీత్కారంగా మాట్లాడారని మండిపడ్డారు. అన్నం పెట్టిన రైతును ఏడిపించిన మంత్రి కొడుకు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవాలని పిలుపునిచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు చేస్తాడని ఎద్దేవా చేశారు. బూతులు తిట్టి.. దాడులు చేసే మంత్రులు కేబినెట్‌లో ఉన్నారని విమర్శించారు. ఇలాంటి నాయకుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కూటమి అధికారంలోకి రావాలని పవన్ తెలిపారు.