నీతి అయోగ్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు(Chandrababu). జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన జరిగిన భేటీలో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి చంద్రబాబు చర్చించారని, తాజాగా చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారని సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ తొలిదశ పనులకు కావాల్సిన రూ.12,500 కోట్లకు చేసిన ప్రతిపాదనను ఆమోదించాలని, ఆ మొత్తాన్ని వీలైనంత త్వరగా అందించేలా చూడాలని కూడా చంద్రబాబు కోరాని తెలుస్తోంది. ఈ భేటీలో కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu), పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) కూడా పాల్గొన్నారు.
కేంద్రమంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు.. మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ను నాశనం చేశారని, అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యతను ఎన్‌డీఏ కూటమికి ప్రజలు అందించారని చెప్పారు. కేంద్రాన్ని ఆంధ్రకు రావాల్సిన పాత బకాయిలే కోరామని, కొత్తగా ఏదో ఇచ్చారని రాజకీయం చేయడం సరికాదని అన్నారు చంద్రబాబు(Chandrababu). ఐదేళ్లలో వైసీపీ సర్కార్.. ఇష్టమొచ్చినట్లు నిధులను దారిమళ్లించిందని, ఈ విషయాన్ని తాము కాకుండా కేంద్రంలోని ఆయా శాఖల మంత్రులే చెప్తున్నారని వివరించారు. కాగా నవంబర్ నాటికి పోలవరం నిధులను విడుదల చేయాలని కోరగా అందుకు కేంద్రమంత్రి సానుకూలంగానే స్పందించారని చెప్పారు.