ఈ ఎన్నికల్లో వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని.. ఈ యుద్ధానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. పీలేరులో నిర్వహించిన ‘రా కదలిరా’ సభల్లో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైనాట్ 175 అంటున్న జగన్‌కు కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని సెటైర్లు వేశారు. నాడు అదే బడ్జెట్.. నేడు అదే బడ్జెట్.. మరి పన్నులు ఎందుకు వేశావ్.. అప్పులు ఎందుకు చేశావ్ అని జగన్‌ను నిలదీశారు.
రాయలసీమలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టారా..? ఒక్క పరిశ్రమ తెచ్చారా..? అని నిలదీశారు. తాను రాయలసీమ బిడ్డనే తనలో ప్రవహించేది కూడా సీమ రక్తమేనన్నారు. తన పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం వచ్చి రాయలసీమను రతనాల సీమగా మార్చే బంగారు అవకాశాన్ని చెడగొట్టిందని మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజలందరూ తీవ్ర అవస్థలు పడుతున్నారని.. ఎప్పుడెప్పుడూ జగన్(Jagan)ను దించేద్దామా అని ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వచ్చేది టీడీపీ(TDP)-జనసేన(Janasena) ప్రభుత్వమేనని.. అధికారంలోకి రాగానే అవినీతిపరుల అంతు చూస్తా అని చంద్రబాబు(Chandrababu) హెచ్చరించారు.