వైసీపీలో ఇన్చార్జిల మార్పులు చేర్పులపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు బదిలీలు ఉండటం తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని సెటైర్ వేశారు. దోపిడీలు చేసి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్న అభ్యర్థులను వేరే నియోజకవర్గాలకు అంటగడుతున్నారంటూ విమర్శించారు. ఇక్కడ చెల్లని కోసం అక్కడ ఎలా చెల్లుతుంది అంటూ ఎద్దేవా చేశారు. 11 మందిని కాదు 150 మందికి సీట్లు మార్చినా వైసీపీ గెలుపు కష్టం అన్నారు.
జగన్ లెక్కలు తారుమారయ్యాయని, ప్రజలు ఈసారి ఆయనని నమ్మరని చంద్రబాబు(Chandrababu) చెప్పుకొచ్చారు. కేవలం దళిత బీసీ, నేతలకే స్థానాలు మార్చారని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. వీళ్ళని మార్చే దమ్ము జగన్(Jagan) కి లేదని, వీళ్లంతా జగన్ కి దగ్గరనీ, బినామీలని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ లో ప్రజాభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. కుప్పం తో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేసి అభ్యర్థులను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. మార్పునకు నాంది పలకాలని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.