మంత్రి రోజాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడొక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.
మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి అనే మహిళ దగ్గర మున్సిపల్ చైర్మన్‌గా చేస్తామని ఆమె నుంచి రూ.40 లక్షల తీసుకున్నారంటే వీళ్లను ఏమనాలి? అని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే ఇలాంటి నేతలను ప్రోత్సహిస్తున్న జగన్ తీరు ఇంకెలా ఉంటుంది? అని ప్రశ్నించారు. నగరి(Nagari) నియోజకవర్గం అంతా అరాచకం అని ధ్వజమెత్తారు. ఈ జబర్దస్త్ ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇక సీఎం జగన్ గురించి చెబుతూ తన తండ్రి వైఎస్ సమాధి వద్దకు బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వాళ్లను తీసుకెళ్లారని విమర్శించారు. జగన్‌తో పాటు బస్సులో అవినాశ్ రెడ్డి ఉన్నారని.. బాబాయ్ హత్య కేసు నిందితుడిగా ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. బాబాయినే చంపిన వారికి ప్రజలు ఓ లెక్కా అని ప్రశ్నించారు. మే 13 తర్వాత జగన్‌ను ఇంటికి పంపడం.. ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని చంద్రబాబు(Chandrababu) ధీమా వ్యక్తం చేశారు.