విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Lokesh) సంచలన వ్యాఖ్యలు చేవారు. ఎక్కడ చదివారో.. ఏం చదివారో కూడా తెలియని వ్యక్తి జగన్.. విద్యారంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయంటూ జగన్ అనడం చాలా వింతగా ఉందని, అసలు జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం హయాంలో వాళ్లు తీసుకున్న నిర్ణయాలు 1000 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల పాలిట శాపంగా మారాయని చెప్పారు. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్ష విధానాన్ని మార్చేస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం వల్ల పదో తరగతి విద్యార్థులు 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుల ప్రశ్నార్థకంగా మారిందంటూ విమర్శలు గుప్పించారు.
కానీ విద్యార్థులను భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే ఈ పరీక్ష విధానంలో మార్పులు తెస్తామని చెప్పారు. అన్ని అంశాలను ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి కొత్త పరీక్ష విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని, 6వ తరగతి పరీక్షల నుంచే కొత్త పరీక్ష విధానాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. పరీక్ష విధానంలో కూడా పలు మార్పులు తెస్తామని, సీబీఎస్‌ఈలో పరీక్షలు రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తామని లోకేష్(Lokesh) చెప్పుకొచ్చారు. విద్యార్థులకు ఇచ్చే గుడ్లు, బర్ఫీలు, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంసమామ జగన్ అంటూ దుయ్యబట్టారు. జగన్ అంత ఉద్దరిస్తే ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఎందుకు తగ్గిపోయిందని ప్రశ్నించారు.