సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసిందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రూ. 1660 కోట్ల బకాయిలను చెల్లించినట్లు సీఎం పేర్కొన్నారు. 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి రూ. 7500 కోట్లను 24 గంటల్లో రైతులకు చెల్లింపు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఆక్వా రైతులకు రూ. 1.50 పైసలకు యూనిట్ చొప్పున కరెంటు అందిస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఆక్వా కల్చర్ కి కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
గత వైసీపీ(YCP) ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ(TDP) హయాంలో 73% పనులను పూర్తిచేశామని.. తమ ప్రభుత్వం కొనసాగితే 2020 నాటికి ప్రాజెక్ట్ పూర్తయి ఉండేదని ఆయన తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) ను కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏరోజూ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదని తెలిపారు. గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, అమరావతిని స్మశానం చేశామని సంతోష పడ్డారని, పోలవరం నిర్వీర్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రైల్వే జోన్(Railway Zone) విషయంలోనూ నిర్లక్ష్యం వహించారని, దానికోసం సరైన స్థలాన్ని కూడా ఆ ప్రభుత్వం సేకరించలేకపోయిందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అసాధ్యం అనుకున్న పనులన్నీ సుసాధ్యం చేసి నిరూపించామని తెలిపారు.
రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సీ(Mega DSC) పై చేసారు. అయితే ఆ హామీ కూడా త్వరలోనే నెరవేరబోతోంది అని సీఎం చెప్పారు. 16,384 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి టీచర్స్ ను నియమించిన తర్వాతే పాఠశాలలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు(Chandrababu) హామీ ఇచ్చారు .