ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి సంకల్పించామని చెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియర్ రికవరీ ఫెసిటిలీ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. చెత్త ఫ్రీ పట్టణాల నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
‘‘పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అక్టోబర్ 2 నాటికి ఆ చెత్త మొత్తాన్ని తొలగిస్తాం. ఆ బాధ్యత మున్సిపల్ శాఖకు అప్పగించాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి నెలలో ఒక్కరోజు కేటాయిస్తే చాలు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగు ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. అదే విధంగా నేరస్థుల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు చెప్పారు. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని, ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు(Chandrababu) వార్నింగ్ ఇచ్చారు.