Cm Jagan disburse input subsidy and interest subvention to farmers today: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రబీ 2020-21, ఖరీఫ్-2021 సీజన్లకు చెందిన వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్-2022 సీజన్‌లో వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నామన్నారు.
గడిచిన మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్మును జమ చేసినట్టు వివరించారు. ప్రస్తుతం..జమచేయనున్న మొత్తంతో కలిపి 73.88 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందినట్లు పేర్కొన్నారు. గడిచిన మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల కింద రైతన్నలకు రూ. 1,37,975.48 కోట్ల సాయం వైసీపీ ప్రభుత్వం అందించిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గతంలో సున్నా వడ్డీ ఎగ్గొట్టిందని.. రుణాల్ని మాఫీ చేస్తామని చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం రుణమాఫీకి కేవలం రూ.15 వేల కోట్లే ఇచ్చారని.. కానీ రైతు భరోసా కింద వైసీపీ ప్రభుత్వం రూ.25,971 కోట్లు ఇచ్చిందని Cm Jagan గుర్తుచేశారు.