ఏపీ సీఎం జగన్(CM Jagan) కు, భార్య భారతీ రెడ్డి(Bharati Reddy) లకు షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. గతంలో ప్రభుత్వ పథకాలు సమాచారంతోపాటు ఎక్కువ రీచ్ ఉండే పత్రికనే కొనాలంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు 200 రూపాయల చొప్పున జి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి తన సొంత పత్రిక సాక్షి పేపర్ సర్కులేషన్ ను పరోక్షంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఉషోదయ పబ్లికేషన్స్(Ushodaya Publications) అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఈ అంశంపై విచారించిన సుప్రీంకోర్టు.. ఈ కేసుని ఏపీ హైకోర్టులో కాకుండా ఢిల్లీ హైకోర్టులో విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఢిల్లీ హైకోర్టు స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఇవాళ నోటీసులు పంపించింది. సాక్షి ఎండీగా భారతీ రెడ్డికి, ఏపీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి(CM Jagan)కి కోర్టు సిబ్బంది నోటీసులు అందించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ వ్యవహారంతో టిడిపి శ్రేణులు సీఎం జగన్ పై విమర్శలు గుర్తిస్తున్నారు. ఇది కదా సెక్షన్ 409 కేసు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ప్రభుత్వ సొమ్మును తన భార్య అయినటువంటి సాక్షి ఎండి భారతీ రెడ్డికి డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా తరలించడం 409 కేసుకి వర్తించదా అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ శ్రేణులు దీని గురించి ఏం సమాధానం చెప్తారంటూ నిలదీస్తున్నారు. ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ కి దమ్ముంటే జగన్ పై కేసు పెట్టాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారంటూ టిడిపి శ్రేణులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా తమ అధినేత పై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన భార్య ఎండీగా వ్యవహరిస్తున్న సాక్షి సంస్థకి పరోక్షంగా లబ్ధి చేకూర్చే యత్నం చేశారనే కేసులో కోర్టు నోటీసులు రావడం చర్చకు దారి తీసింది.