CPI Ramakrishna fires on YCP Govt: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రానికి ప్రతి విషయంలో వైసీపీ ఎంపీలు సహకరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ పెళ్లి చేసుకోలేదు కానీ.. కలిసి కాపురం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ, అప్పులు చేయటంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి చేరుకోవటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఏడాదికి 41 వేల కోట్లు అప్పులు తెస్తామని ఆరు నెలల్లోనే ప్రభుత్వం 49 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు రామకృష్ణ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ ఒద్దికగా పరస్పరం కలిసిపోయారని ఆరోపించారు.
ఇటువంటి పరిస్థితుల్లో పవన్ బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నారంటే.. ఆయనను అమాయకుడు అనుకోవాలా, లేదా పవన్ అన్నీ తెలిసే నటిస్తున్నాడా అని అనుమానం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే.. ప్రతిపక్షాలు ఏకతాటి పైకి రావాలని చెప్పిన పవన్, నేడు నేను సెపరేట్ అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో జగన్‌ను గద్దె దించేందుకు ఎవరితోనైనా కలిసి నడుస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలవకపోతే.. అవే తన చివరి ఎన్నికలు అని చంద్రబాబు అనటంతో తప్పులేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేస్తారో.. ఇప్పుడే చెప్పలేమని అన్నారు. కానీ, ప్రజలు బీజేపీ, వైసీపీ ఒకటే అన్న భావనలో ఉన్నారని రామకృష్ణ (CPI Ramakrishna) దుయ్యబట్టారు.