విజయవాడలో వరదలు పోటెత్తుతున్న క్రమంలో కృష్ణలంకలోని వరద ఉధృతిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి ఆయన వరద బాధితులను పరామర్శించారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. వరద బాధితులకు అందించే సహాయం విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, మూడు రోజుల నుంచి వరదలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా కూటమి ప్రభుత్వం వారికి ఏ విధమైన సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా చిన్నారులు అందరూ కూడా ఒకటో అంతస్తులో బిక్కుబిక్కు మంటూ ఉన్నారని, వారికి ఆహారం కూడా లేదని అక్కడి ప్రజలు జగన్‌కు చెప్పుకున్నారు.
‘‘మూడు రోజుల నుంచి తిండి, తిప్పలు లేకుండా చిన్నారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఏమైనా ప్రభుత్వం సాయం చేసిందా. ఇప్పటి వరకు సరే.. ఇకనైనా వారికి సాయం చేయాలన్న ఆలోచన అసలు ప్రభుత్వానికి ఉందా?’’ అని జగన్(YS Jagan) ప్రశ్నించారు. కాగా జగన్‌ను కలిసిన ప్రజల్లో కొందరు తమను పరామర్శించడానికి జగన్ తప్ప మరే ఇతర నాయకుడు రాలేదని చెప్పారు. తమకు సాయం చేయడానికి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పుకొచ్చారు. జగన్ కట్టిన కృష్ణలంక రిటర్నింగ్ వాల్ లక్షల మందిని ఈ వరదల సమయంలో సురక్షితంగా ఉంచుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.