కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై ఆ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్(Harsha Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవొద్దని తెలిపారు. తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న ఆమెకు ఏపీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఆమె కంటే సమర్థవంతమైన నాయకులు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. కావాలంటే ఆమెకు ఏఐసీపీ పదవి లేదా రాజ్యసభ పదవి ఇవ్వాలని సూచించారు. జగన్, షర్మిల ఒక్కటేనని.. అందుకు ఆమెకు రాష్ట్ర బాధ్యతలు ఇవ్వొదని పార్టీ పెద్దలను విజ్ఞప్తి చేశారు.
కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల(YS Sharmila)ను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆమెకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి తిరిగి జవసత్వాలు వస్తాయని పెద్దలు ఆలోచిస్తున్నారు. అలాగే వైసీపీలో జగన్ వైఖరి పట్ల అంసతృప్తిగా ఉన్న నేతలందరూ తిరిగి సొంతగూటికి చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్కే వంటి నేతలు బహిరంగంగానే కాంగ్రెస్‌లో చేరతామని ప్రకటించారు. దీంతో షర్మిలకే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. ఈ తరుణంలో హర్షకుమార్(Harsha Kumar) వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.