నీటితో కళకళలాడాల్సిన జీవనది గోదావరి(Godavari River) ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇసుకమేటలతో ఎడారిలా దర్శనమిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. గతేడాది జులై 6న భద్రాచలం వద్ద 15.5 అడుగుల నీటితో నిండు కుండలా దర్శనమివ్వగా.. ప్రస్తుతం 2.2 అడుగుల నీటితో పిల్ల కాలువలా ప్రవహిస్తోంది. గత జులై పదో తేదీన 43 అడుగులకు చేరి, 15 కు 71.3 అడుగులకు పెరిగి తర్వాత తగ్గుముఖం పట్టింది. వరద ప్రభావంతో జిల్లాలోని 130 గ్రామాలు అతలాకుతలం కాగా.. ఈ ఏడాది కనీసం సాగు, తాగు నీరు అందించే పరిస్థితి లేక పోవడం రైతులు, ప్రజలకు ఆందోళన కల్గించే విషయం.
ఉమ్మడి పశ్చిమగోదావరి(West Godavari) జిల్లాకు సాగునీరు అందాలంటే ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) నిండాలి. అక్కడకు నీరు చేరాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీలేరు, శబరి నదులే దిక్కు. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన ప్రతి చినుకు వరదరూపంలో గోదావరికే చేరుతుంది. అలా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరిన నీరు కిందికి వెళ్లాలంటే అక్కడ నీటిమట్టం కనీసం 25.72 మీటర్లకు చేరాలి. ప్రస్తుతం అక్కడ 22. 250 మీటర్ల స్థాయిలోనే నీరు ఉంది. 5.5 మీటర్ల నీటిమట్టం పెరగాలి. అంత పెరగాలంటే భారీవర్షాలు కురవాలి. అప్పుడే ఉభయగోదావరి జిల్లా(Godavari Districts)ల్లో తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీరతాయి.