వైకుంఠ ఏకాదశికి తిరుమల(Tirumala) వెళ్ళాలి అనుకునేవారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో ‘టీటీడీ డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. తిరుమలలో సామాన్య భక్తులకు తక్కువ ధరకు అన్న ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజానికి రెండు హోటళ్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. తిరుమలలోని హోటళ్లలో అధిక ధరలకు అన్నప్రసాదం విక్రయిస్తున్నారనే భక్తుల ఫిర్యాదుల నేపథ్యంలో స్థానిక అన్నమయ్య భవనం, నారాయణగిరి హోటళ్లను ఏపీ టూరిజానికి అప్పగించామని చెప్పారు. రెండు చోట్లా పనితీరును గమనించి మరికొన్ని హోటళ్లను కేటాయించడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జనతా హోటళ్లలో అధిక ధరలకు అన్నప్రసాదాలు విక్రయించినట్లు ఫిర్యాదు అందితే సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు దర్శనానికి వీలుగా రెండు లక్షల టికెట్లను త్వరలోనే ఆన్లైన్లో విడుదల చేస్తామని చెప్పారు. పది రోజుల వ్యవధిలో ఆఫ్ లైన్ లో ఐదు లక్షల టికెట్లను ఇస్తాం అని తెలిపారు. ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నెల 19న గరుడసేవ నాడు కనుమ దారిలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు వెల్లడించారు. ఈ నెల 17 నుంచి 19 వరకు కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేశారు.