వైసీపీ ప్రభుత్వం అవినీతిపై ప్రధాని మోదీ(PM Modi)కి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఐదు పేజీల లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పేరిట భూసేకరణకు ప్రభుత్వం రూ.32,141కోట్ల నిధులను దుర్వినియోగం చేసిందని తెలిపారు. ఇందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించి భారీ అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
గతంలో నిర్మించిన టిడ్కో(TIDCO) ఇళ్లను లబ్దిదారులకు అందించలేదని వివరించారు. మొత్తం 6.68 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి అయితే కేవలం 86,984 మందికి మాత్రమే అందించారని పవన్(Pawan Kalyan) వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ(CBI), ఈడీ(ED)లతో విచారణ చేయిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వేళ జగన్(Jagan) సర్కార్ అవినీతిపై ఏకంగా ప్రధాని మోదీకి జనసేనాని లేఖ రాయడం కలకలం రేపుతోంది.