సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshmi Narayana) ప్రకటించిన కొత్త పార్టీపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తీవ్ర విమర్శలు గుప్పించారు. లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టడం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ గెలవకుండా ఓట్లు చీల్చేందుకు జేడీతో ఆర్ఎస్ఎస్(RSS), బీజేపీ(BJP)లు కొత్త పార్టీ పెట్టించిన్నట్లు తనకు సమాచారం ఉందని పేర్కొ్న్నారు. ఇందుకోసం రూ.1000 కోట్లు తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ప్రజాశాంతి పార్టీలో చేరతానని తెలిపిన జేడీ.. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టినా తమకు వచ్చే నష్టమేమీ లేదని పాల్ తెలిపారు.
కాగా ‘జై భారత్ నేషనల్(Jai Bharat National)’ పేరుతో కొత్త పార్టీని జేడీ లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను పార్టీ పెట్టడానికి నిరుద్యోగ సమస్యతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణమన్నారు. ప్రజలు ఎవరికీ బానిసలు కాదని మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన లక్ష్మీ నారాయణ.. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో అభిప్రాయభేదాలు కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.