చంద్రబాబు, లోకేశ్‌పై బెజవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) చేసిన విమర్శలపై టీడీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. నాని సోదరుడు చిన్ని(Kesineni Chinni) స్పందిస్తూ చంద్రబాబును అనే స్థాయి లేదని ఫైరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని నానికి సలహా ఇచ్చారు. పార్టీ వీడినా ఏరోజు అధినేత చంద్రబాబును ఒక్క మాట కూడా విమర్శించలేదన్నారు. అంత హుందాగా రాజకీయాలు చేశారు కాబట్టే సీఎం, మంత్రి అయ్యారని తెలిపారు.
1999 నుంచి తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని.. కానీ తానే సర్దకువస్తున్నానని స్పష్టంచేశారు. తమ కుటుంబ గొడవలకు చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. కేశినేని నాని వైసీపీకి కోవర్టు అని..నాలుగేళ్ల నుంచి వైసీపీకి టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. మహామహులే వెళ్లిపోయినా టీడీపీకి ఏం కాలేదని.. ఎందరో వస్తుంటారు.. పోతుంటారు అని చిన్ని(Kesineni Chinni) పేర్కొన్నారు.
ఇక ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న(Buddha Venkanna) అయితే నాని మీద తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారు.. ఇప్పుడు జగన్ కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు బీఫాం ఇస్తే గెలిచిన వ్యక్తివి.. మళ్లీ రతన్ టాటా స్థాయి అంటున్నావ్.. ఆ స్థాయి ఇచ్చిందే చంద్రబాబు కదా అని మండిపడ్డారు. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టాడని, కబ్జాలు చేశాడని ఆరోపించారు. నాని అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందని త్వరలోనే బయటపడతానని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే వైసీపీ నేత, నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)కూడా కేశినేని నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. “బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్” అని ట్వీట్ చేశారు.