విజయవాడ రాజకీయాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నాని(Kesineni Nani) ప్రకటించగా.. తాజాగా ఆయన కుమార్తె కేశినేని శ్వేత(Kesineni Swetha) కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. నగర కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన ఆమె.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో శ్వేత(Kesineni Swetha) భేటీ అయ్యారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్, తన గెలుపులో కీలకపాత్ర పోషించిన గద్దె రామ్మెహన్‌కు ముందుగా తన నిర్ణయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయనను కలిశానని చెప్పుకొచ్చారు. కాగా కూతురు రాజీనామా విషయాన్ని ఎంపీ కేశినేని నాని ముందుగానే వెల్లడించారు. కార్పొరేటర్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా శ్వేత రాజీనామా చేస్తుందని సొషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే.