Kodali Nani comments on Telangana cm KCR BRS Party: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌పై మాజీ మంత్రి, ఎమ్మల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్, ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారేమో అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఏపీలో బీఆర్‌ఎస్ మునుగడకు కాలమే సమాధానం చెప్తుందన్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చునని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్(KCR)ను ఏపీ ప్రజలు వ్యతిరేకించారు.. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఆంధ్రా వాళ్లు టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించారు అని గుర్తు చేశారు.
ఎవరైనా, ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు.. పోటీ చేసుకోవచ్చునని కొడాలి నాని (kodali Nani) అన్నారు. కానీ ఇప్పటికీ కేసీఆర్‌పై ఆంధ్రలో వ్యతిరేకత ఉందనీ.. అది ఎంత మేర ఉంది.. బీఆర్‌ఎస్‌కు ఏపీలో క్యాండిడేట్లు దొరుకుతారా లేదా అన్న విషయాలకు కాలమే సమాధానం చెప్తుందన్నారు. చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసి జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు.. కేసీఆర్ ఏపీలో ఎందుకు పోటీ చేయకూడదని కొడాలి నాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమాయకులైన అమరావతి రైతుల ముసుగులో కమ్మ కుల ఉగ్రవాదులు పాదయాత్ర చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఓడిపోయిన 10 మంది కమ్మ టీడీపీ నేతలు తనను కుల బహిష్కరణ చేయటానికి గుడివాడలో తొడలు కొట్టారంటూ ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చెప్తున్న మాటలన్నీ ట్రాష్ అంటూ కొడాలి నాని కొట్టిపడేశారు.