కాంగ్రెస్ పార్టీలో షర్మిల(YS Sharmila) చేరడంపై వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే వైసీపీకి వచ్చే నష్టమేమి లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani). ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే తమ ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుందని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా లేదన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్‌ను ఏం పీకలేరని తనదైన శైలిలో కొడాలి(Kodali Nani) వ్యాఖ్యానించారు.
అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) స్పందిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా తమకు ప్రతిపక్షమే అని తెలిపారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్లినంత మాత్రాన తాము పార్టీ మారి తమ కాళ్లు తామే నరుక్కుంటామా? అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ను విమర్శించే టీడీపీ(TDP), కాంగ్రెస్, జనసేన(Janasena) తమకు వ్యతిరేక పార్టీలే అని వెల్లడించారు.
ఇక మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) కూడా స్పందిస్తూ ఎవరు ఏ పార్టీలో చేరినా అందరూ కలిసి పోటీచేసినా వైసీపీకి వచ్చిన నష్టం ఏమి లేదని స్పష్టంచేశారు. వైసీపీలో అవకాశం లేదంటేనే తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారని.. ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నారని తెలిపారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉన్నందున మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.