కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు(Kodi Kathi Srinu) భారీ ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని ఆదేశించింది. అలాగే ఈ కేసు గురించి ఎక్కడా మీడియాతో మాట్లాడవద్దని సూచించింది.
కోడికత్తి కేసులో సీఎం జగన్(CM Jagan) సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాకపోవడంతో గత ఐదేళ్లుగా శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శ్రీను తల్లి, సోదరుడు సైతం నిరాహార దీక్ష చేశారు. దళిత సంఘాలు కూడా పోరాటం చేశారు. మొత్తానికి వారి పోరాటానికి ఫలితం లభించింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై కోడికత్తి దాడి జరిగింది. దీంతో ఈ కేసులో శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న శ్రీను(Kodi Kathi Srinu).. బెయిల్ మంజూరు చేయాలని ఎన్‌ఐఏ(NIA) కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 24న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.