వైసీపీ పార్టీ ని వీడడంపై మర్రి రాజశేఖర్(Marri Rajashekar) స్పష్టతనిచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మండిపడ్డారు. జగన్ హామీలను ఇస్తారు కానీ నిలబెట్టుకోలేరని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి చిలుకలూరిపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించినట్లు తెలిపారు. 40 ఏళ్లుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉందని, అయినప్పటికీ ఎంతో ఓర్పుతో నియోజకవర్గంలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే జగన్ తీరని అన్యాయం చేసారని అన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాల నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజశేఖర్ వెల్లడించారు.
2019 ఎన్నికల్లో విడదల రజినీకి(Vidadala Rajini) టికెట్ ఇచ్చి.. ప్రచారంలో తనకు ఎమ్మెల్సీ తో పాటు మంత్రి హోదా కల్పిస్తానాని జగన్(YS Jagan) మాట ఇచ్చినట్లు రాజశేఖర్ తెలిపారు. అదేవిధంగా 2024 లో చిలుకలూరు పేట నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం చిలుకలూరిపేట పార్టీ ఇంచార్జి బాధ్యతలను నిర్వహించాలని, ఒక మంచిరోజున ప్రకటిస్తానని వైఎస్ జగన్ తెలిపారని ఆయన చెప్పారు. ఇచ్చిన మాట తప్పి గుంటూరు వెస్ట్ లో ఓటమిపాలైన రజిని కి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు కట్టబెట్టారని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనతో పాటు కార్యకర్తలకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. విలువ ఇవ్వని పార్టీ ఉండకూడదని రాజశేఖర్(Marri Rajashekar) నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కార్యకర్తలతో చర్చించి త్వరలోనే టీడీపీ లో చేరనున్నట్లు స్పష్టం చేసారు.