Married Three Young Women And Cheated a Young Man: తనకు పెళ్లి కాలేదని మోసగించి మెుత్తం ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడో ఘనుడు. అంతటితో ఆగకుండా, రెండో భార్య పేరిట ఉన్న బీమా డబ్బులపై కన్నేసిన మోసగాడు.. ఆమెను ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. వేధింపులు భరించలేని ఆమె హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో మరో మహిళను వివాహమాడాడు. అనంతరం ఆమె నుంచి లక్షల్లో కట్నం తీసుకోవటమే కాకుండా, ఆమె తల్లి ఫోన్ ద్వారా ప్రైవేట్ యాప్ నుంచి లక్షల్లో లోన్ తీసుకున్నాడు. చివరికి ఇతగాడి బాగోతం బయటపడటంతో.. కేసు నమోదు చేశారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ విషయం దాచిపెట్టి.. తన గ్రామానికే చెందిన మరొక మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండో భార్య పేరుపై ఉన్న బీమ డబ్బుపై కన్నేసిన మహేంద్ర.. ఆమె చనిపోతే, ఆ బీమా డబ్బు తనకే వస్తుందని ఆశపడ్డాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తూ, వేధింపులకు గురిచేసేవాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె హైదరాబాద్‌కు వెళ్లి పోయింది.
అనంతరం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన మరొక మహిళతో పరిచయం పెంచుకొని, తనకు పెళ్లి కాలేదని నమ్మించాడు. ఆమెను పెళ్లి చేసుకొని, రూ. 5 లక్షలు, ఆమె తల్లి ఫోన్ ద్వారా ప్రైవేట్ లోన్ యాప్ ద్వారా రూ. 5 లక్షలు రుణం తీసుకున్నాడు. అయితే మూడో పెళ్లి విషయం తెలుసుకున్న రెండో భార్య మహేంద్రపై, అతని తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మూడు పెళ్లిల్ల (Married Three Young Women) విషయం బయటపడింది.