విశాఖ(Vizag) ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. బాధితులకు అండగా ఉండాలని.. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు తగు సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. అటు ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులను స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ చేయనున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగడం దురదృష్టకరమని వెల్లడించారు.
Vizag | కాగా ఆదివారం అర్దరాత్రి జరిగిన ప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధం కాగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు దగ్ధం కావడంతో మత్స్యకారులు బోరున విలపించారు. ఒక్కో బోటు ఖరీదు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉంటుందని రూ.కోట్లల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.