మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నడుపుతున్న బైక్‌ను పక్కనే మరో బైక్ ప్రమాదవశాత్తూ ఢీకొట్టడంతో, ఎమ్మెల్యే కింద పడియారు. దీంతో ఎమ్మెల్యే కాలికి తీవ్ర గాయమయ్యింది. వెంటనే ఆయన్ను నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాలుకు తీవ్ర గాయం కావటంతో, శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం, ఎమ్మెల్యేను విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మహాపాదయాత్ర చేస్తున్న విషయం తెలిసింది. ఈ పాదయాత్ర త్వరలోనే విశాఖకు చేరుకోనుంది. ఈ క్రమంలోనే మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే గణేష్ బైక్ ర్యాలీ చేపట్టారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఆయన చేపట్టిన ర్యాలీలోనే తీవ్రంగా గాయపడటంతో, ఇప్పుడు ఆ ర్యాలీను మరొకరు కొనసాగిస్తారా.. మధ్యలోనే ఆగిపోనుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.