Mla Thopudurthi Prakash Reddy fires on TDP leaders: అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గత టీడీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. పరిటాల సునీత సివిల్ సప్లై మినిష్టర్‌గా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాని పరిశ్రమలు జిల్లాకు వచ్చాయంటూ.. టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదనీ.. అవి చీకటి ఒప్పందాలు అంటూ విమర్శలు గుప్పించారు.
రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చింది భూముల కోసమేనని.. వారు ఇక్కడ భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని ఎమ్మెల్యే ఆరోపించారు. టీడీపీ హయాంలో జాకీ పరిశ్రమ వచ్చినట్లు.. వైసీపీ హయాంలో వెనక్కి పోయినట్లు ప్రచారం చేస్తున్నారనీ.. లీజు ప్రాతిపదికన ఏ కంపెనీ వచ్చినా.. పరిశ్రమలు పెట్టేందుకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. రైతుల భూములతో వ్యాపారాలు చేయాలని చూస్తే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నారా లోకేష్ ఒక నామినేటెడ్ రాజకీయ నాయకుడని ఎద్దేవా చేశారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు తెచ్చామని భ్రమలు కల్పించారనీ.. అందుకే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి (Mla Thopudurthi) అన్నారు.