ప్రజలను దోచుకుంటున్న అదానీని కాపాడటానికి మోదీ సర్కార్ ఎక్కడా లేని కుటిల ప్రయత్నాలు చేస్తోందంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు స్వరాజ్యం కోసం పోరాడిన కాంగ్రెస్ ఈనాడు ప్రజల రక్తాన్ని పీలుస్తున్న కార్మొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కార్‌పై పోరాడేందుకు నడుంబిగించిందని వెల్లడించారు. ‘‘నాడు, బ్రిటిష్ వారిపై నిస్వార్థంగా పోరాడి, స్వేచ్ఛయే లక్ష్యంగా అలుపెరగని సుదీర్ఘ సమరం చేసి, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు, మరోసారి, ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, ప్రజల ఆస్తులను విచక్షణారహితంగా దోచుకుంటున్న కార్పొరేట్ జలగలు, వారిని పెంచిపోషిస్తున్న, వారిచేతిలోనున్న రిమోట్ కంట్రోల్ తో నడుస్తున్న మోదీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ, దేశం కోసం మరొక పోరాటం సాగిస్తోంది’’ అని పేర్కొన్నారు.
‘‘అదానీ వంటి క్యాపిటలిస్టు రక్కసి ధోరణిని ప్రజలమీదకు రుద్దుతూ, ప్రభుత్వ సంస్థలను తన జేబు సంస్థలుగా మార్చి, కేవలం ప్రతిపక్షాల మీద కక్షపూరిత దాడులకు మాత్రమే వాటిని వాడుకునే మోదీ(Modi) నియంత పాలనపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. అదానీ లాభాలు మోదీ లాభాలుగా, అదానీ సంస్థల వృద్ధి, బీజేపీ వృద్ధిగా మారిన దారుణ పరిస్థితుల్లోకి దేశాన్ని నెట్టేశారు మోదీ. దీనిపై దర్యాప్తు ప్రారంభించడం ప్రభుత్వానికి నైతిక మరియు వృత్తిపరమైన బాధ్యత. ఇంత తీవ్రమైన ఆరోపణపై మౌనం వహించి, మీ కార్పొరేట్ మిత్రులను కాపాడటానికి అన్ని కుటిల మార్గాలను వాడుకోవటం ఎంతో సిగ్గుచేటు’’ అంటూ YS Sharmila విమర్శలు గుప్పించారు.