ఏపీలోని విజయనగరం టీడీపీ ఎంపీ అప్పల నాయుడు(MP Appala Naidu) తన నియోజకవర్గంలో ఇకపై జన్మించే ప్రతి మూడవ ఆడబిడ్డకు రూ.50,000 విరాళం ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆడపిల్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఈ డబ్బు జమ చేస్తానని, ఆమె వివాహ వయస్సు నాటికి ఇది రూ.10 లక్షల వరకు ఉండవచ్చని చెప్పారు. మూడవ సంతానం మగపిల్లవాడు అయితే ఒక ఆవు, ఒక దూడను ఇస్తామని చెప్పారు. మూడవ సంతానం ఆడపిల్ల అయితే రూ. 50,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామన్నారు.
భారత జనాభా పెరగాలి అని అప్పల నాయుడు అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాను పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) ఇచ్చిన పిలుపుతో తాను ప్రేరణ పొందానని ఎంపీ అన్నారు. తన నియోజకవర్గంలోని ప్రతి మహిళకు ఈ ఆఫర్ ను వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలలో, వ్యక్తిగత జీవితంలోని అనేక మంది మహిళలు తనను ప్రోత్సహించారని ఆయన గుర్తుచేసుకున్నారు. వారిలో తన తల్లి, భార్య, సోదరీమణులు, కుమార్తె కూడా ఉన్నారన్నారు. ఇంకా, మహిళలు వివక్షకు గురవుతున్నందున వారిని ప్రోత్సహించడం కూడా ప్రస్తుత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం తన నియోజకవర్గంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన(MP Appala Naidu) ఈ ఆఫర్ ను ప్రకటించారు.