Nadendla Manohar counter on Cm Jagan: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పర్యటలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తెలుగు బూతులపార్టీ, జనసేనను రౌడీ సేనగా మార్చేసిందని.. జగన్ చేసిన వ్యాఖ్యల్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఖండిచారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న జనసేనని పవన్‌కల్యాణ్, వీర మహిళలు, జనసైనికులను జగన్ కించపర్చారని ఆగ్రహంవ్యక్తం చేశారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అసహనం, ఆందోళనకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకు జనసేన రౌడీసేన అవుతుందా?. మత్స్యకారులకు మీ ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా?. పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా?. లేకా.. మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా?. మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా?. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకు జనసేన రౌడీసేన అవుతుందా?’’ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) సీఎం జగన్‌ను నిలదీశారు.