టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని.. ప్రజల తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారని నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అగరాలలో నిర్వహించిన ‘నిజం గెలవాలి(Nijam Gelavali)’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు. రాజకీయాల కోసం తాను ఇక్కడికి రాలేదని.. నిజం గెలవాలి అని చెప్పేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఈ పోరాటం తనదే కాదు ప్రజలందరిదీ అన్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పించాలని నిత్యం ఆలోచించేవారన్నారు. సరైన రోడ్డు లేని ప్రాంతంలో, రాళ్లు రప్పల మధ్య హైటెక్ సిటీ ఏంటని? అందరూ హేళన చేశారు. అయినా పట్టించుకోకుండా చిత్తశుద్ధితో పనిచేసి లక్షల మంది ఐటీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపారు. ముందుచూపుతో కొండలు, గుట్టల మధ్య కట్టిన సైబరాబాద్ సిటీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ హబ్‌గా మారి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతుందన్నారు.
చంద్రబాబుపై స్కిల్ డెవలెప్‌మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులు పెట్టారని.. ఒక్క కేసులోనైనా ఆధారాలు చూపించారా అని ప్రశ్నించారు. పుంగనూరులో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ఎన్నాళ్లీ దారుణాలు? అందరం చేయీ.. చేయీ కలిపి పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అరెస్టు చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తే టీడీపీ చెల్లాచెదురవుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.. కానీ చంద్రబాబు(Chandrababu)ను ఏమీ చేయలేరన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకమే రాజ్యమేలుతోందని.. మహిళలకు రక్షణ లేదన్నారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి. సత్యమేవ జయతే అంటూ కార్యకర్తలతో భువనేశ్వరి(Nara Bhuvaneswari) ప్రతిజ్ఞ చేయించారు.