‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) సిద్ధమయ్యారు. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసిన ఆమెకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా నారావారి పల్లె చేరుకున్నారు. ఆమెతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ప్రాణాలు విడిచిన టీడీపీ అభిమానుల కుటుంబాలను ఆమె ఈ యాత్ర ద్వారా పరామర్శించనున్నారు. రేపు(బుధవారం) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ యాత్రకు భువనేశ్వరి శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజులపాటు తిరుపతి జిల్లాలో ఆమె యాత్ర చేయబోతున్నారు. మార్గమధ్యలో బహిరంగ సభలు, సమావేశాల్లో ఆమె పాల్గొనేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో పాటు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలకు ఆమె వివరించనున్నారు. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. బాబు అరెస్టుతో ప్రజల్లోకి వచ్చారు. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించిన బస్సు కూడా రెడీ అయింది. ఈ బస్సుపై ఎన్టీఆర్, చంద్రబాబు(Chandrababu), భువనేశ్వరి(Nara Bhuvaneswari) ఫొటోలతో కూడిన డిజైన్ ఏర్పాటు చేశారు.
Read Also: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి ఉపవాస దీక్ష.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat