ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై(Odisha Train Accident ) వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి స్పందించారు. భారతీయ రైల్వేలో ఇది అతి పెద్ద ప్రమాదమని తెలిపారు. ఇందులో ఎలాంటి మానవ తప్పిదం ఉండకపోవచ్చని.. సాంకేతిక సమస్య ఉండే అవకాశం ఉందన్నారు. కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో పరిస్థితి అదులోకి రావడానికి మరో 24 గంటలు సమయం పడుతుందని చెప్పారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైన వారిని మరో రైలులో విశాఖ తీసుకొస్తున్నామన్నారు.
మరోవైపు ఒడిశాలో ప్రమాదానికి(Odisha Train Accident ) గురైన రైళ్లలో ఏపీకి చెందిన వారు 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. మృతులు, క్షతగాత్రులు, మిస్సింగ్ వివరాల సమాచారం సేకరిస్తున్నామని వివరించారు. విజయవాడలో దిగాల్సిన 39మందిలో 23 మంది కాంటాక్ట్‌లోకి వచ్చారని.. ఏడుగురి ప్రయాణికుల ఫోన్లు స్విచాఫ్.. మరో ఐదుగురు ఫోన్‌లు లిఫ్ట్ చేయని పరిస్థితి నెలకొందన్నారు. అటు సహాయక చర్యలు కోసం ఏపీ అధికారుల బృందం ఒడిశా వెళ్లిందని.. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ప్రమాదస్థలికి చేరుకున్నారని వెల్లడించారు.