Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా నిత్య చైతన్యమూర్తులై పోరాడాలని పేర్కొన్నారు. ఆనాటి కాలమాన పరిస్థితులలో తెలుగువారిని ద్వితీయ శ్రేణి పౌరులుగానే మద్రాస్ ప్రెసిడెన్సీలో పరిగణించేవారని.. ఈ వివక్షను భరించలేక పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను పణంగా పెట్టి, తెలుగువారిలో చైతన్యం తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిపెట్టారని గుర్తుచేశారు. ఆంధ్రులలో ఎటువంటి చైతన్యం కోసం అమరజీవి తపించారో ఆ చైతన్యం ఆంధ్రప్రదేశ్ వాసులలో ఈనాడు ఏమైంది? అని ప్రశ్నించారు. రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్న ఎందుకు స్పందన కరవైందని నిలదీశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతున్నా, రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా, ప్రజలకు పాలకులుకనీస వసతులు కల్పించలేకపోతున్నా రాష్ట్ర ప్రజలు ఎందుకు ప్రశ్నించరు? అని ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో అక్రమార్కులు పాలన చేస్తుంటే ఎన్నాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందాం. ఈ పర్వదినాన బాధ్యతాయుతమైన పౌరులందరూ ఆలోచన జరపాలి. ఆంధ్రప్రదేశ్ శాంతిసౌభాగ్యాలతో విరాజిల్లేలా కార్యాచరణతో ముందుకు సాగాలి. ఓటును ఆయుధంగా మలచాలి. ఆంధ్రప్రదేశ్ ను మన దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలి. ఆనాడే త్యాగధనుల త్యాగాలకు సార్ధకత అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు.