ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. మిగిలిన అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Sekhar) ఆస్తుల వివరాలు తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పెమ్మసాని కుటుంబానికి మొత్తం రూ.5,785 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598.65 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.186.63 కోట్లుగా పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రూ.1,038కోట్లు అప్పులు ఉన్నట్లు తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు.
గుంటూరు జిల్లాలో పుట్టిన పెమ్మసాని(Pemmasani Chandra Sekhar).. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివారు. అనంతరం పైచదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడే మెడికల్ ఫీల్డ్‌లో స్థిరపడ్డారు. మాస్టర్స్ పూర్తి చేసి జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. యూవరల్డ్ పేరుతో మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఆన్‌లైన్ ఎడ్యూటెక్ కంపెనీని నడుపుతున్నారు. దీంతో పాటు పలు వ్యాపారులు కూడా ఉన్నాయి. అయితే తాను పుట్టిన జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచారు.