హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో ఓ వ్యక్తి చేసిన పనికి.. బస్సులోని వారంతా బిక్కుబిక్కుమని బతికారు. తను దుబాయ్‌కు వెళ్లలేకపోయానన్న నిరాశతో ప్రయాణీకులపై కారం చల్లాడటంతో ప్రయాణీకులు ఊపిరి ఆడక, ఒళ్లు మంటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. కానీ పాస్‌పోర్ట్ సరిగ్గా లేదని అతడిని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెనక్కి పంపించేశారు. స్వగ్రామానికి వెళ్లేందుకు బయలుదేరేందుకు హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఇంద్ర ఆర్టీసీ బస్సును ఎక్కాడు. బస్సు పాలకొల్లు సమీపంలోకి రాగానే.. రాంబాబు ఒక్కసారిగా ప్రయాణీకులకు కారం చల్లాడు. ఈ హఠాత్ పరిణామానికి ప్రయాణీకులు షాక్‌కు గురయ్యారు. కారం ఘాటుకు ప్రయాణీకులు హాహాకారాలు చేశారు. పోలీసులకు సమాచారం అందిచటంతో, సంఘటనా స్థలానికి చేరుకొని, రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌కు వెళ్లలేకపోతున్నాననే తీవ్ర నిరాశతోనే అతడు కారం చల్లాడనే, మరో దురుద్దేశం లేదని పోలీసులు వెల్లడించారు.