ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కూడా రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 7,8 తేదీల్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రంలో ప్రధాని పర్యటిస్తారు.
ముందుగా ఈ నెల 7వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు.
తర్వాత 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అలాగే అదే రోజు రాత్రి 7 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరనున్నారు. కాగా టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సభలో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొన్న విషయం విధితమే.